Online Puja Services

భావిస్తే, ప్రతిరోజూ శివరాత్రే !

13.59.195.118

భావిస్తే, ప్రతిరోజూ శివరాత్రే ! If we feel, every day is Shivratri 
లక్ష్మీ రమణ 

మహా శివరాత్రి శివుని ఆవిర్భావం జరిగిన పవిత్రమైన రోజు. అజ్ఞానం అనే అంధకారం అలుముకున్నప్పుడు, జ్ఞానమనే మహా జ్యోతిగా పరమాత్మ వ్యక్తమై వెలుగులు  పంచిన రోజు. అవ్యక్తుడైన పరమాత్మ వ్యక్తమైన దివ్యమైన రోజుని పండుగగా చేసుకోవడం ఋషులు నిర్దేశించిన సనాతన సంప్రదాయం. మహా శివరాత్రి మాఘమాసంలో వచ్చే పర్వం.  ఈ విధంగా మనకి ప్రతి మాసంలోనూ ఒక శివ రాత్రి  వస్తుంది. దీన్నే మాస శివరాత్రి అంటారు. నిజానికి భారతీయ శివ సంప్రదాయికులకి నిత్యమూ శివరాత్రిని జరుపుకొనే విధానాన్ని ధర్మశాస్త్ర గ్రంధాలు నిర్దేశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నిత్య శివరాత్రి, మాస శివరాత్రి, మహా శివరాత్రి అనే పర్వాలని అర్థం చేసుకొనే చిరుప్రయత్నం ఇది .  

నిత్య శివరాత్రి : 

ఈ సంప్రదాయం ఎంత విశిష్టమైనదంటే, ప్రతి రోజులోనూ సృష్టి స్థితి లయాలు అనే మూడు - జగత్ స్థితులనీ ప్రస్తుతించేది.  మనము నిమిత్తమేననీ, చేసేవాడు, చూసేవాడు, ఈ రెండింటికీ మూలమైనవాడూ వేరొకడున్నాడని, అతన్ని ఆరాధించడము చేత జన్మరాహిత్యం సాధ్యమని చెప్పే ఈ సంప్రదాయం కేవలం సనాతన సంప్రదాయం యొక్క విశేష విజ్ఞాన విపంచి.     

ఉదయం నిద్రలేస్తూ సత్సంకల్పాన్ని కలిగి ఉండడం- సృష్టి . ఆ సంకల్పాన్ని  నెరవేర్చేవిధంగా అనుగ్రహించమని శ్రీహరిని వేడుకుంటూ , ఆ స్థితికారకుని నామాన్ని మూడుసార్లు పఠించడం, జాగృదావస్థని పరిరక్షించామని వేడుకోవడం  - స్థితి .  ఇక రాత్రి నిద్రాసమయం.  నిద్రకి స్వల్పకాలిక లయమని పేరు.  ఈ వుదయం సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటూ, నిత్యమూ శివారాధన చేస్తూ  ఉండడం నిత్యా శివరాత్రిగా చెప్పబడింది. 

మాసశివరాత్రి : 

ప్రతిరోజులోనూ వచ్చే ప్రదోషకాలం వంటి పవిత్రమైన సమయం నెలలో వచ్చే ఈ మాస శివరాత్రి.  ప్రతినెలలోనూ అమావాస్యకి ముందర వచ్చే చతుర్ధశి తిథిని మాసశివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాం. మహాశివుడు లయకారకుడు . నిత్యమూ  అసుర సంధ్య వేళ లేదా ప్రదోష కాలములో  శివ పూజ ఎంతటి విశిష్టమో,  అలా ఒక నెలలో మాస శివరాత్రి పూజ విశిష్టమైనది. ఈరోజు కూడా మహాశివరాత్రి లాగానే శివారాధనలూ, శివాభిషేకాలు, బిల్వ పత్రి పూజలూ, శివాలయ సందర్శనలూ, భజనలూ, ఉపవాసాలు, జాగరణలూ చేయడం మహా పుణ్యప్రదం. 

మహాశివరాత్రి : 

మాఘమాసం అప్పటివరకూ ఉన్న చలితో కూడిన అంధకారాన్ని తొలగించి , సూర్యుడి వెలుగుని పెంచే మాసం .  అందుకే మన పెద్దలు శివరాత్రినాడు శీతాకాలం శివశివా అనుకుంటూ వెళ్ళిపోతుంది. అంటూ ఉంటారు.  అటువంటి విశిష్టమైన మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మహా శివరాత్రిగా జరుపుకుంటాం . ముందే చెప్పుకున్నట్టు ఇది శివుడు ఒక జ్యోతిస్వరూపమై ఆవిర్భవించిన రోజు  అవ్యక్తమైన పరమాత్మ వ్యక్తుడై నిలిచిన రోజు. 

అయితే, ఇక్కడ శివునికి ఒక్కరికే ఆరాధన కాదు. శివ అనే శబ్దానికి ప్రక్రుతి, పురుషుడు ఇద్దరూ అర్థమే .  శివ పార్వతులిద్దరినీ కలిపి  కలిపి ‘శివులు’ అంటారు.  శివ శ్చ శివా చ శివౌ అని కదా ఆర్ష వాక్యం . ఆ ఇద్దరినీ కలిపి అర్చించుకోవడం శివరాత్రి . అందుకని ఆరోజు వారిద్దరి ఏకత్వానికి ప్రతీకగా శివపార్వతుల కల్యాణాన్ని జరిపిస్తారు . 

మహాపవిత్రం శివరాత్రి : 

శివారాధనలోని విశేషాన్ని ఇక్కడ మనం ఒక్కసారి గమనించాలి . మహా శివ భక్తులైన నాయనార్లు గాధలు శివునితోపాటు శివ చిహ్నాలు కలిగిన అంటే, విభూతిని రాసుకోవడం, రుద్రాక్షలు ధరించడం వంటివి కలిగి ఉండి, నిత్యా శివారాధన చేసే శివ భక్తులు కూడా సాక్షాత్తూ శివునితో సమానమే . వారిని సేవించినా శివుడు తనని సేవించినట్టే భావిస్తారు.  అని ఉంది.  అందువల్ల మహాశివరాత్రి మాత్రమే పర్వదినం, ఆరోజు మాత్రమే శివారాధన అనుకోకూడదు. భావించగలిగినవారికి ప్రతిరోజూ శివరాత్రే. శివానుష్ఠానం ప్రతిరోజూ  చేసేవారికి ఇహలోక, పరలోక సౌభాగ్యాలు శివానుగ్రహం చేత మెండుగా లభిస్తాయి.  

రోజూ ఆ విధంగా చేయలేని కర్మల్లో ఉన్నవారు , నిత్యమూ ప్రదోషకాల పూజని తప్పనిసరిగా చేసుకోవచ్చు.  అదికూడా కుదరని సందర్భంలో మాసశివరాత్రిని శివసాన్నిధ్యంలో, శివనామస్మరణతో గడపవచ్చు. వీటిల్లో విశిష్టమైన మహా శివరాత్రి ప్రాశస్త్యాన్ని మాత్రం ఇంతా అంతా అని చెప్పనలవి కాదు.  

మహాశివరాత్రి పర్వదినాన తెలిసిగానీ, తెలియక గానీ భక్తి తోగాని, డంబముతో గాని, ఎవరైతే స్నానము, దానము, ఉపవాసము జాగరణ చేస్తారో వారికి శివ సాయుజ్యం, కైలాస ప్రాప్తి తధ్యమని మన శృతులు తెలియజేస్తున్నాయి.

శివరాత్రి వ్రతాలు : 

జాబాల శ్రుతిలో రుషులు పది శైవవ్రతాలను గురించి చెప్పారు. శివపూజ, రుద్రజపం, శివాలయంలో ఉపవాసం, వారణాసిలో మరణం అనే నాలుగు సనాతనమైన ముక్తి మార్గాలు, అష్టమి తిథితో కూడిన సోమవారం, కృష్ణపక్షం నాటి చతుర్ధశి శివుడికి ఎంతో ప్రీతికరం.ఇవన్నీ ఓ ఎత్తైతే శివరాత్రి వ్రతం అన్నిటికంటే గొప్పది. ఎలాగో ఒకలాగా మనిషి పట్టుపట్టి ఈ వ్రతాన్ని చెయ్యటం మంచిది. ధర్మసాధనలన్నిటిలో ఉత్తమమైనదని దీనికి పేరు. ఏ భేదమూ లేకుండా సర్వవర్ణాలవారు, అన్ని ఆశ్రమాలవారు, స్త్రీలు, పిల్లలు ఒకరనేమిటి దీన్ని ఎవరైనా చేసి మేలు పొందవచ్చు. 

 శివశివా అని నెత్తిన చెంబెడు నీళ్లు కుమ్మరించి, ఇంత భస్మం అలిమి , ఇన్ని బిల్వదళాలు లింగం మీద పెడితే మహా సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యే భోళాతనం పరమాత్మది అని నిరూపించిన ఏకైక దేవుడు శివుడు. ఈశ్వరా ! అని కౌగలించుకుంటే, యముడికే కాల యముడై భక్తులని రక్షించుకునే పరమదయాళువు.  కాలము నిత్యమూ మానని గమనిస్తూ మన పరిణామ క్రమాన్ని నిర్దేశిస్తే, ఆ కాలానికే కాలమైన ఈశ్వరుని ఆరాధించేందుకు కాలనియమము లేదు.  సదా సర్వదా తల్లిగా , తండ్రిగా, సఖునిగా, ప్రియునిగా , ఆత్మగా , పరమాత్మగా మాతో ఉండే ఆ లయకారుని ఆర్తితో పిలవడమే మన వంతు. అనుగ్రహించేందుకు ఆయన సదా సిద్దమే ! ఆయన దివ్యమైన అనుగ్రహం ఎల్లరకూ సిద్ధించాలని కోరుతూ … శుభం . 

 

 

shivaratri, sivaratri, masasivaratri, Shiva, Siva, Shankara, Mahadev, 

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore